Friday 17 May 2013
Friday 23 March 2012
TRANSLATION AND GRAMMAR BIG CHALLENGE
అనువాదం పెద్ద సవాలు: ఎంవిఆర్ శాస్ర్తీ
పత్రికల్లో పనిచేసేవారికి అనువాదం పెద్ద సవాలుగా మారిందని, పద వివరణలు దొరుకుతున్నాయే తప్ప ఆంగ్లపదాలకు సరైన, నిర్దిష్టమైన, స్పష్టమైన, తేలికైన సమానార్ధక తెలుగు పదాలు రూపొందించాల్సి ఉందని ఆంధ్రభూమి సంపాదకుడు ఎంవిఆర్ శాస్ర్తీ అన్నారు. నిఘంటువుల రూపకల్పనలో పాత్రికేయుల సహకారం తీసుకోవాలని, పత్రికలు అలవాటు చేసిన కొన్ని పదాలు భాషాసాహిత్య పరంగా దోషాలే అయినా జనవాడుకలోకి రావడంతో వాటిని ఉపేక్షించలేక పోతున్నామని అన్నారు.
తెలుగు విశిష్ట కేంద్రం త్వరలో ఏర్పాటు కాబోతోందని, అనంతర కార్యక్రమానికి 55 కోట్ల రూపాయలు వ్యయం అయ్యే ప్రణాళిక రూపొందించామని తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కె. యాదగిరి చెప్పారు. భాషను పత్రికలే పరిరక్షిస్తున్నాయని, తెలుగుభాషకు ప్రాణం పోస్తూ మంచి సాహిత్యాన్ని కూడా అందిస్తున్నాయని కొనియాడారు.
విశిష్ట్భాషా కేంద్రం ఏర్పాటు అనంతరం సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉందని ఆచార్య జయధీర్ తిరుమల రావు చెప్పారు. భాషానిపుణులు రోజురోజుకూ తగ్గిపోతున్నారని, వారి వద్ద ఉన్న సంపదను ముందుగా పరిరక్షించుకోవలసి ఉందని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉన్న తెలుగుసాహిత్య సంపదను ఒకే చోటకు తీసుకు వచ్చే ప్రయత్నం ఈ సందర్భంగానైనా జరగాలని, దానిని డిజిటిలైజేషన్ చేయాలని ప్రాచీన భాషను పరిరక్షించుకుంటూనే ఆధునిక భాషావసరాలను తీర్చగలిగే స్థాయిలో విశిష్ట్భాషా కేంద్రం సేవలుండాలని అన్నారు.
విశిష్ట్భాషా హోదా కేంద్రాన్ని మైసూర్‌లో కొనసాగించడం ఏ విధంగానూ భావ్యం కాదని, దీనిపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునేందుకు వివిధ శాఖల మధ్య సమన్వయ లోపమే ఆటంకమని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్ వ్యాఖ్యానించారు. ఆధునిక భాషావసరాలకు ప్రాచీన భాష ఆనవాళ్లను ఎలా వాడుకుంటున్నామనేది చాలా ముఖ్యమవుతుందని, శాశ్వత నిఘంటు నిర్మాణం జరగాలని అన్నారు. మాజీ ఉప కులపతి కొలకలూరి ఇనాక్ మాట్లాడుతూ సమగ్ర నిఘంటువు వచ్చిన రోజునే తెలుగు భాషకు బలమైన ఆయుధం దొరికినట్టవుతుందని అన్నారు. కోవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ తెలుగు కావ్యాలను ప్రబంధాలను ఇతర భాషల్లోకి ప్రధానంగా హిందీలోకి తీసుకురావాలని అన్నారు. వౌఖిక సాహిత్యాన్ని రికార్డు చేయాలని మాజీ ఐపిఎస్ అధికారి ఆంజనేయ రెడ్డి సూచించారు. మరో మాజీ ఉప కులపతి రవ్వా శ్రీహరి మాట్లాడుతూ పదప్రయోగకోశాలు రావాలని అన్నారు. నమస్తే తెలంగాణ సంపాదకుడు అల్లంనారాయణ మాట్లాడుతూ భాషలో ఆధిపత్యం పనికిరాదని అన్నారు. అన్ని మాండలిక పదాలనూ ప్రజాస్వామ్యయుతంగా ఆమోదించాలని కోరారు. ఈనాడు తెలుగువెలుగు ఎడిటర్ శంకరనారాయణ మాట్లాడుతూ పాఠశాలల్లో తెలుగుభాష వాడకంపై దృష్టిపెట్టాలని, భాషకు ప్రాంతీయత ఉండదని చెప్పారు. డాక్టర్ విజయకుమార్ మాట్లాడుతూ తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కావాలని సూచించారు. కాలువ మల్లయ్య, అమ్మంగి వేణుగోపాల్, డాక్టర్ రామాంజనేయులు, డాక్టర్ వి. సత్తిరెడ్డి, కలశపూడి శ్రీనివాస్, ప్రొఫెసర్ తోమసయ్య తదితరులు మాట్లాడారు. అనంతరం సమావేశం 11 తీర్మానాలను చేసింది.
ROADMAP TO TELUGU BHASHA
తెలుగు విశిష్ట భాషా కేంద్రానికి దారిపటం
తెలుగు విశిష్ట భాషా కేంద్రం దిశనూ, దశనూ నిర్ధారించే కీలక సమావేశం హైదరాబాద్‌లో గురువారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా విశిష్ట్భాషా కేంద్రానికి దారిపటం ఖరారు చేశారు. పండితులు, సంపాదకులు పాల్గొన్న ఈ సమావేశంలో భారతీయ భాషల కేంద్ర సంస్థ ప్రతినిధి విజయసారథి మాట్లాడుతూ ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పారు. రానున్న 20 ఏళ్లకు విస్తృత ప్రణాళిక రూపొందిస్తున్నామని, అందులో భాగంగా సమగ్ర గతి శీలక నిఘంటువు రూపొందిస్తామని వెల్లడించారు. గత డిసెంబర్‌లో ఎస్వీయులో జాతీయ సదస్సు నిర్వహించామని, ఏప్రిల్ 29 నుండి మేధోమథనం సదస్సు, గత నెల ప్రాచీన తెలుగు శాసనాలపై సదస్సు నిర్వహించామని వెల్లడించారు. నవంబర్ 20 నుండి జరిగిన సదస్సులో తెలుగుభాషకు వెబ్‌సైట్ నిర్ధారణ అయిందని అన్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో తెలుగు శాఖాధ్యక్షుల సదస్సును, 28 నుండి మూడు రోజుల పాటు నాణాలు-రాతప్రతుల సమావేశం నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. నేషనల్ ట్రాన్స్‌లేషన్ మిషన్ ఆధీనంలో తెలుగు పదబంధాల సేకరణ జరుపుతామని, ‘శబ్దసాగర రత్నాకరం’ పేరుతో బృహన్నిఘంటువు రూపొందిస్తామని వెల్లడించారు.
Thursday 15 March 2012
Wednesday 14 March 2012
Sunday 11 March 2012
With Intellectuals,President KALAMJI,Dalailama
Subscribe to:
Posts (Atom)