అది, 2008లో కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ప్రాంగణంలో కృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద కావ్యానికి శ్రీకారం చుట్టిన మంటపాన్ని పునర్నిర్మింపచేసి, అందులో కృష్ణ దేవరాయలు కావ్యరచన చేస్తున్న భంగిమలో నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తున్న సందర్భం. రాష్ట్రం అంతా బుద్ధప్రసాద్ కు రెండవ విడత మంత్రివర్గ విస్తరణలో తప్పకుండా అవకాశం వస్తుందనీ ఆయనకు విద్యా, సాంస్కృతిక శాఖలు అప్పగిస్తారని ఎదురు చూస్తున్న సమయం అది. సరిగ్గా సభలు ప్రారంభమయ్యే సమయానికి కృష్ణా జిల్లాకు ముఖ్యమంత్రి అధికార పర్యటనకు వచ్చారు .పదవులు ఆశిస్తున్న జిల్లా రాజకీయ శక్తులన్నీ ముఖ్యమంత్రి చుట్టూ కేంద్రీకరించి ఉన్నాయి. బుద్ధప్రసాద్ మాత్రం సభల ఏర్పాటు మీద మాత్రమే మనసు లగ్నం చేశారు ముఖ్యమంత్రి కలవటానికి వెళ్ళనే లేదు. అదీ ఆయన నిబద్ధత...!
శ్రీకాకుళం సభలు : రెండవ తెలుగు భాషోద్యమం : మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో తెలుగువారి తొలి రాజధాని కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో 2002 నవంబర్ 1, 2 తేదీలలో జరిగిన తెలుగు భాషోద్యమ సమాలోచన శిబిరం తెలుగు భాషోద్యమానికి నాందీ పలికింది. అమ్మ భాష పట్ల మమతానురాగాల్ని పెంపొందించటం ప్రధాన కార్యక్రమంగా ప్రజల గుండె తలుపులు తట్టి భాషా చైతన్యాన్ని కలిగించే అనేక కార్యక్రమాలు ఆనాటినుంచీ తెలుగు నేలమీద ముమ్మరంగా జరిగాయి. ఇదే సభలో తెలుగు భాషోద్యమ సమాఖ్య శ్రీకారం చుట్టుకుంది. బుద్ధప్రసాద్ నాయకత్వంలో డా. సామల రమేష్‌బాబు, సి.ధర్మారావు ఇంకా ఎందరో బాషోద్యమానికి నడుం బిగించారు. గిడుగువారు నడిపిన వ్యావహారిక భాషోద్యమానికి కొనసాగింపుగా దీనిని రెండవ తెలుగు భాషోద్యమం అన్నారు.
జీవో నం.86 సాధన : తెలుగువాడిగా పుట్టి, తెలుగునేల మీద తెలుగు అక్షరంముక్క నేర్చుకోకుండా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేసుకునే దురదృష్టకర అవకాశం ఈ దేశంలో ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ తెలుగు రాష్ట్రంలో తెలుగు చదవకుండా వుంటేనే ప్రభుత్వ గుర్తింపు ఉంటుందనే పరిస్థితి నడుస్తోంది. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు బుద్ధప్రసాద్. దానిపైన విస్తృత పోరాటమే ఆయన చేయాల్సి వచ్చింది. తెలుగు భాషోద్యమం, తెలుగు భాషోద్యమ సమాఖ్య, తెలుగు భాషాభిమానులు ఆయనకు అండగా నిలబడ్డారు. దాని ఫలితంగానే జీవో నం.86 ను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. అక్షరాభ్యాసం నుంచి 10వ తరగతి వరకూ తెలుగు తప్పనిసరిగా బోధనాంశంగా ఉండాలనేది ఈ 86వ జీవో సారాంశం. త్రిభాషా సూత్రానికి అనుగుణంగా తెలుగును తప్పనిసరి చేస్తున్న జీవో. భాషోద్యమ పరంగా ఇది బుద్ధప్రసాద్ అధిగమించిన ఒక మైలురాయి. హైదరాబాద్‌లో తెలుగుతల్లి విగ్రహం మీద తెలుగుతల్లి అని తెలుగులో రాయకపోవటం, సెక్రెటేరియట్‌లో రాష్ట్ర సచివాలయం అని తెలుగు అక్షరాల్లో ఎక్కడా లేకపోవడం, ఏ ఊళ్ళోనూ ఏ దుకాణం మీదా ఒక్క తెలుగు బోర్జు కనిపించకపోవడం ఇలా తెలుగు అనేది ఒక పనికిరాని అంశంగా మారిపోతోందని ఆయన ఆవేదన చెంది చేసిన ఆందోళన ఫలితంగా సచివాలయంలో ఇప్పుడు ఎక్కడ చూసినా తెలుగు అక్షరాలు కనిపిస్తున్నాయి. తెలుగు తల్లి అని మనం ఇప్పుడు తెలుగులో చదవవచ్చు.
No comments:
Post a Comment